ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
# రాజధాని అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు ఆమోదం
# అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల పనులకు గ్రీన్ సిగ్నల్
# భవనాలు, లేఔట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఆమోదం
# తిరుపతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు ఆమోద ముద్ర
# పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు గ్రీన్ సిగ్నల్
# గుంటూరు జిల్లా, పత్తిపాడు మండలం, నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలు స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
# ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోద ముద్ర
# రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం
# రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
# విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడులకు అమోదం
# శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ.1,046 కోట్ల పెట్టుబడిలకు క్యాబినెట్ ఆమోదం
# అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
వీటితో పాటు చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది.