ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్‌కు అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. జైల్లో ఖైదీగా ఉండాల్సిన ఆర్జేడీ నేత… దర్జాగా ప్రభుత్వ వసతి గృహంలో గడపడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అధికారులపై వేటు పడుతోంది. మరోవైపు… అరెస్ట్ వారంటున్న నేత ఏకంగా న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై దుమారం రేగుతోంది. సీఎం నితీష్ టార్గెట్‌గా విమర్శలతో విరుచుకుపడుతోంది.. 1994లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో 35 ఏళ్ల IAS అధికారి కృష్ణయ్యపై మూకదాడి జరిగింది. బీహార్ పీపుల్స్ పార్టీ ఎంపీ ఆనంద్ మోహన్ ఆదేశాల మేరకు కృష్ణయ్యను కొట్టి చంపారు దుండగులు. ఈ కేసులో ఆనంద్ మోహన్, అతని భార్య లౌవ్లీ సహా మొత్తం ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఆనంద్ మోహన్‌ను దోషిగా నిర్ధారిస్తూ 2007లో పాట్నా హైకోర్టు తీర్పు చెప్పింది. అతనికి మరణ శిక్ష విధించింది. తర్వాత దానిని యావజ్జీవ ఖైదుగా మార్చింది. 2012లో శిక్ష తగ్గించాల్సిందిగా ఆనందన్ మోహన్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా… అతని పిటిషన్‌ను తిరస్కరించింది. 2020 సెప్టెంబర్‌లో ఆనంద్ మోహన్ భార్య లౌవ్లీ ఆనంద్, అతని కొడుకు చేతన్ ఆర్జేడీలో చేరారు.
Read Also: Pakistan: పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం.. కిడ్నాప్ చేసి మరీ నీచంగా..!
సహర్సా జైల్లో ఉన్న ఆనంద్ మోహన్‌ను ఓ కేసు విషయంలో ఈ నెల 12న పాట్నా జిల్లా కోర్టులో హాజరుపర్చారు. అయితే, అంతకు ముందు రోజే అతన్ని జైలు నుంచి పాట్నాకు తీసుకొచ్చారు. ఆగస్టు 11 రాత్రి పాటలీపుత్ర కాలనీలో గల తన ఇంట్లోనే గడిపాడు ఆనంద్ మోహన్. అంతేకాదు… ఎమ్మెల్యేగా ఉన్న అతని కొడుకు చేతన్, భార్య లౌవ్లీతో పాటు ఆర్జేడీ నేతలు, మద్దతుదారులతో కలిసి దర్జాగా ఫొటోలు దిగాడు. 12వ తారీఖున కోర్టులో హాజరుపర్చాక కూడా ఆనంద్ మోహన్ జైలుకు వెళ్లలేదు. ఈ సారి ఏకంగా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో ఓ అతిథిగా గడిపాడు. 12వ తారీఖున ఖగాడియా గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్‌లో రెండు గదులు బుక్ చేశాడు ఆనంద్ మోహన్ కొడుకు. ఓ గదిలో ఆనంద మోహన్ కుటుంబం బస చేయగా, రెండో గదిలో అతని మద్దతుదారులు బసచేశారు. ఈ రెండు సందర్భాల్లో ఆనంద్ మహన్ తన మద్దతుదారులతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో పోలీసు శాఖలోని లొసుగులు బయటపడ్డాయి. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ నేరస్తుడు జైల్లో కాకుండా దర్జాగా జనం మధ్య తిరుగడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. బీహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు.. ఆర్డేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న యాదవ్ వర్గానికి చెందిన మంత్రి వ్యవహారంపైనా దుమారం రేగుతోంది. మొత్తానికి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్‌కు ఆ పార్టీ నేతల తీరు తలబొప్పికట్టిస్తోంది.