New Criminal Laws: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో ఈ చట్టాలు అమలు చేయబడుతాయి. వలస రాజ్యాల చట్టాలను పాతరేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకువచ్చింది. ఈ మేరకు వీటి అమలుపై శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read Also: YV Subba Reddy: తుదిజాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023లు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) కోడ్ -1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872 స్థానాల్లో జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మూడు బిల్లులకు గతేడాది పార్లమెంట్ ఆమోదం తెలుపగా.. డిసెంబర్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత చట్టాలుగా రూపుదాల్చాయి.
కొత్తగా తీసుకువచ్చిన మూడు చట్టాలు ఉగ్రవాదం, హత్యలు, జాతీయ భద్రతకు హాని కలిగించే నేరాలకు శిక్షలను మరింత కఠినతరం చేయనున్నాయి. భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, IPCలో ఉన్న 19 నిబంధనలు తొలగించబడ్డాయి. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనలలో జరిమానా శిక్షను పెంచారు, 23 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా ప్రవేశపెట్టారు.