New Aviation Rules: పవర్ బ్యాంకులు, లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే పరికరాల వాడకంపై విమాన భద్రతా నిబంధలను మారాయి. వీటి వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తూ ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీల వల్ల వేడెక్కడం లేదా మంటలు చెలరేగడం వంటి సంఘటనల తర్వాత విమానంలో ప్రయాణించే సమయంలో ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జింగ్ చేయడానికి పవర్ బ్యాంకులను వాడటాన్ని నిషేధించింది. విమానంలో సీట్ల వద్ద ఉండే ఛార్జింగ్ పాయింట్ల వద్ద కూడా వీటిని ఛార్జ్ చేయాడాన్ని బ్యాన్ చేసింది.
డీజీసీఏ నవంబర్‌లో జారీ చేసిన ‘‘డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్య్కులర్’’లో పవర్ బ్యాంకులు, స్పేర్ బ్యాటరీలను హ్యాండ్ లగేజీలో మాత్రమే అనుమతిస్తామని, ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్లలో తీసుకెళ్లవద్దని చెప్పింది. ఇలాంటి ప్రదేశాల్లో వీటిని పెడితే, మంటలను గుర్తించడం, నియంత్రించడం కష్టం.
లిథియం బ్యాటరీలతో ప్రమాదం..
లిథియం బ్యాటరీలు మంటలు చెలరేగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవది అధిక శక్తిని కలిగి ఉంటాయి. కొన్ని సార్లు వీటి నుంచి ఏర్పడే మంటల్ని నియంత్రించడం కష్టతరం అవుతుంది. రీఛార్జబుల్ పరికరాల్లో లిథియం బ్యాటరీలను విస్తృతంగా ఉపయోగించడంతో విమానాల్లో కూడా వీటిని తీసుకెళ్తున్నారు. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్‌లు, లిథియం బ్యాటరీలను కలిగి ఉన్న పరికరాలు పేలే అవకాశాలు ఉన్నాయి. ఇవి విమానాల్లో మంటల్ని రేకెత్తించే ఛాన్స్ ఉందని సర్క్యులర్ పేర్కొంది.
ఓవర్ హెడ్ స్టోరేజ్, క్యారీ అన్ బ్యాగేజీలో లిథియం బ్యాటరీలను స్పష్టంగా చూసే అవకాశం లేదు. ఏదైనా మంటలు చెలరేగితే భారీ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు తీసుకెళ్లే లిథియం బ్యాటరీలకు సంబంధించిన భద్రతా ప్రమాద అంచనాలను సమీక్షించాలని DGCA విమానయాన సంస్థలను ఆదేశించింది. టెర్మినల్ ప్రవేశాలు, చెక్-ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీ కేంద్రాలు, బోర్డింగ్ గేట్ల వద్ద లిథియం బ్యాటరీ అగ్ని ప్రమాదాలపై స్పష్టమైన భద్రతా సందేశాలు, వీడియోలను ప్రదర్శించాలని DGCA విమానాశ్రయాలను కోరింది.
గతేడాది లిథియం బ్యాటరీ సంబంధిత సంఘటనలు జరిగాయి. ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో సమా అనేక అంతర్జాతీయ విమాన సంస్థలు, దేశాలు వీటిపై ఆంక్షల్ని పెట్టాయి. జనవరిలో, దక్షిణ కొరియాలోని గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ బుసాన్ విమానం మంటల్లో చిక్కుకుంది. దర్యాప్తులో బ్యాటరీ లోపల ఇన్సులేషన్ దెబ్బతినడంతో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగి ఉండొచ్చని తేలింది.