Site icon NTV Telugu

Nehal Modi: పీఎన్‌బీ బ్యాంకు మోసం కేసు, అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్..

Nehal Modi

Nehal Modi

Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు. ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.

యూఎస్ ప్రాసిక్యూటర్ల ఫిర్యాదు ప్రకారం, నేహాల్ రెండు అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మనీలాండరింగ్ మరియు క్రిమినల్ కుట్ర, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (LoUs) ఉపయోగించి PNBని సుమారు రూ.13,500 కోట్ల రుణాలను మోసం చేసినందుకు సీబీఐ, ఈడీ ఇతడిని కోరుతోంది.

Read Also: Narayanpet: దారుణం.. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తని హత్య చేసిన భార్య..

మరోవైపు, నీరవ్ మోడీని అప్పగించడానికి యూకే హైకోర్టు ఇప్పటికే ఆమోదం తెలిపినప్పటికీ, అతను అనేక అప్పీళ్లు దాఖలు చేయడం వల్ల అతడిని భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు ఆలస్యమవుతున్నాయి. లండన్ జైలులో ఉన్న నీరవ్ మోడీ 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించబడ్డాడు.

నీరవ్ మోడీ తరుపున నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్ చేయడంలో నేహాల్ కీలక పాత్ర పోషించాడని ఈడీ, సీబీఐ దర్యాప్తులో తేలింది. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచడానికి షెల్ కంపెనీల వెబ్, సంక్లిష్ట విదేశీ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో అక్రమ నిధులను దాచిపెట్టడానికి, బదిలీ చేయడానికి నీరమ్ మోడీకి సాయం చేశాడు. అప్పగింత ప్రక్రియలో తదుపరి విచారణ తేదీ జూలై 17న జరగనుంది. ఈ విచారణ సమయంలో నేహల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అతని అభ్యర్థనను వ్యతిరేకిస్తామని US ప్రాసిక్యూషన్ తెలిపింది.

Exit mobile version