మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు. ఇంకోవైపు డిసెంబర్ 5నే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుందని బీజేపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది. హఠాత్తుగా ఆయన దేశ రాజధానికి వెళ్లారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై హైకమాండ్‌తో చర్చేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై బీజేపీ అగ్ర నేతలతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పోర్టుపోలియోలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
వాస్తవానికి సోమవారం ముంబైలో ఎన్డీఏ సమావేశం జరగాల్సి ఉంది. కానీ ఏక్‌నాథ్ షిండేకు అనారోగ్యం కారణంగా సమావేశం రద్దైంది. కీలక సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ధ్వజమెత్తుతున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-132, షిండే శివసేన-57, ఎన్సీపీ-41, ఉద్ధవ్ థాక్రే-20, కాంగ్రెస్-16, శరద్ పవార్-10 సీట్లు సాధించాయి. అయితే షిండే వర్గం.. మహారాష్ట్రలో కూడా బీహార్ ఫార్ములా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సీట్లు లేకపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి సూత్రం.. మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని పట్టుబడుతోంది. చివరికి బీజేపీ అధిష్టానం ఏం తేల్చనుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ