Pakistan Elections: దక్షిణాసియాలో చర్చనీయాంశంగా పాకిస్తాన్ ఎన్నికలు మారాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఇలా పలు సంక్షోభాల్లో చిక్కుకున్న తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి. గురువారం ఆ దేశంలో పోలింగ్ జరగ్గా, నిన్న సాయంత్రం నుంచి కౌంటింగ్ జరుగుతోంది. 24 గంటలు దాటిని ఇంకా దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఏ పార్టీ గెలుచిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అయితే, తాజాగా మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) జాతీయ ఎన్నికల్లో విజయం సాధించానని, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చిస్తామని శుక్రవారం ప్రకటించారు. కాగా, షరీఫ్ ఎన్ని స్థానాలు గెలిచాడనే విషయాన్ని వెల్లడించలేదు. పాక్ జాతీయ అసెంబ్లీలోని 265 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.
ఆ దేశ ఎన్నికల ప్యానెల్ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం.. నవాజ్ షరీఫ్ పార్టీ 42 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 133 మార్కు కంటే ఎక్కువ స్థానాలు అవసరం. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై తన డిప్యూటీలతో, ఇతర రాజకీయ పార్టీలతో సమావేశమవుతానని షరీఫ్ ప్రకటించారు. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ మద్దతుదారులు 57 సీట్లు గెలుచుకున్నారు.