కాంగ్రెస్ లీడర్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. 20 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 1988 జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి మరణించిన కేసులో సిద్దూకు సుప్రీంకోర్ట్ గురువారం ఒక సంవత్సరం జైలు శిక్షను విధించింది. ఈ కేసులో సిద్దూకు నేరం చేశాడనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్ట్ మే 18, 2018న రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే బాధితులు మరోసారి ఈ కేసును సమీక్షించాలని కోరుతూ మరోసారి సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సిద్దూ కేసును మరోసారి ఓపెన్ చేసింది అత్యున్నత న్యాయస్థానం.
రాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరి మరణానికి కారణమైన సిద్దూకు తగిన శిక్ష అమలు చేయాలని బాధిత కుటుంబం మరోసారి సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా.. జస్టిస్ ఏఎం కాన్విల్కర్, సంజయ్ కిషన్ కౌల్ తో కూడిన ధర్మాసనం సిద్దూకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్షను విధించింది. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్ట్ సిద్దూను దోషిగా తేలుస్తూ మూడేళ్లు జైలు శిక్ష విధించింది… దీనిపై సిద్దూ సుప్రీం కోర్ట్ లో అప్పీల్ చేయాాగా ఈ కేసును రిజర్వ్ లో ఉంచింది. తాజాగా రివ్యూ పిటిషన్ ను విచారించిన సుప్రీం సిద్దూకు జైలు శిక్ష ఖరారు చేసింది.
పంజాబ్ ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సిద్దూ.. కాంగ్రెస్ దారుణ ఓటమి తరువాత పీసీసీ పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు పాక్ ఆర్మీ చీఫ్ కమల్ జావెద్ బజ్వాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిద్దూపై విమర్శలు ఉన్నాయి. ఇటీవల పంజాబ్ ఎన్నికల్లో సీఎం చన్నీకి, సిద్దూకు పడకపోవడంతో కాంగ్రెస్, ఆప్ చేతిలో దారుణ పరాజయం పాలైంది. అంతకుముందు పంజాబ్ సీఎంగా ఉన్న అమరిందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి తొలగించడంలో కూాడా సిద్దూ కీలకంగా వ్యవహరించారు.