National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడో రోజు విచారించనుంది ఈడీ. ఇప్పటి వరకు రెండు రోజుల పాటు సోనియా గాంధీ విచారణ సాగింది. సుమారు 9 గంటల పాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు సోనియా. సోనియా గాంధీ విచారణ సందర్భంగా నిన్నంతా ప్రియాంకాగాంధీ తోడుగా ఉన్నారు. ఈ రోజు కూడా ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీకి తోడుగా ఉండనున్నారు. గత గురువారం సోనియా గాంధీని 3 గంటల పాటు విచారించారు. నిన్న మంగళవారం కూడా సోనియా గాంధీ విచారణ సాగింది. యంగ్ ఇండియా సంస్థ, నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలపై సోనియాగాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇటీవల విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలను, సోనియా సమాధానాలతో పోల్చి చూస్తున్నారు. యంగ్ ఇండియా ప్రైవేటు సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకే మెజారిటీ షేర్లు ఉన్నాయి.
Read Also: Tiger Deaths: మూడేళ్లలో భారీగా పులుల మరణాలు..పులుల దాడిలో ఎంత మంది మరణించారంటే..
మరోవైపు ఈడీ విచారణకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళను చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీతో పాటు 57 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న సమయంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తో సహా, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్న క్రమంలో పోలీసుల దురుసు ప్రవర్తన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనలపై చర్యలు తీసుకుంటానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై కక్ష సారిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.
ఈ రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ నెలకొంది. ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్బర్ రోడ్డులో బారికేడ్ల ఏర్పాటు చేసి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏఐసీసీ వద్ద 144 సెక్షన్ విధించారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా పార్లమెంట్ లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చిస్తున్నారు.