Tiger Deaths In India:ఇండియాలో పులులను సంరక్షించేందుకు ప్రభుత్వాలు అనేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పులుల మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా కేంద్రం పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే సోమవారం లోక్ సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో దేశంలో 329 పులులు మరణాలు సంభవించాయని వెల్లడించారు. గణాంకాల ప్రకారం 2019లో 96, 2020లో 106, 2021లో 127 పులులు మరణించినట్లుగా మంత్రి పార్లమెంట్ కు తెలిపారు. ఇందులో 68 పులులు సహజ కారణాల వల్ల మరణిస్తే.. వేట కారణంగా 29 పులులు మరణించినట్లు వెల్లడించారు. 197 పులుల మరణాలపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
Read Also: 5G Auction: ‘5జీ’ వేలానికి సూపర్ రెస్పాన్స్.. తొలిరోజే ఇలా..
ఇదిలా ఉంటే పులుల దాడుల వల్ల దేశంలో గడిచిన మూడేళ్లలో 125 మంది మృత్యువాత పడ్డారు. ఎక్కువగా మహారాష్ట్రలో 61 మంది, ఉత్తర్ ప్రదేశ్ లో 25 మంది పులుల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏనుగుల విషయానికి వస్తే మూడేళ్లలో కరెంట్ షాకులతో 222 ఏనుగులు మరణించాయని.. ఒడిశాలో 41 ఏనుగులు, తమిళనాడులో 34 ఏనుగులు, అస్సాంలో 33 ఏనుగుల మరణాలు సంభవించాయని ప్రభుత్వం వెల్లడించింది. రైలు ప్రమాదాల వల్ల 45 ఏనుగులు మరణించినట్లు వెల్లడించారు. వీటిలో ఒడిశాలో 12, పశ్చిమ బెంగాల్ లో 11 ఏనుగులు మరణించాయని ప్రభుత్వం తెలిపింది. వేట కారణంగా మేఘాలయలో 12, ఒడిశాలో 7, అస్సాంలో 9 ఏనుగులు మరణించినట్లు గణాంకాలు తెలిపాయి. విషప్రయోగం వల్ల 11 ఏనుగులు మరణించినట్లు ప్రభుత్వం పార్లమెంట్ కు వెల్లడించింది.