NTV Telugu Site icon

PM Modi: మిత్రుడు ‘‘ట్రంప్’’ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మోడీ సందేశం..

Narendra Modi

Narendra Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన అమెరికా పర్యటనకు ముందు కీలక సందేశం ఇచ్చారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ..‘‘ నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటి పదవీకాలంలో నిర్మించబడిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడాని పర్యటన సహకరిస్తుందని మోడీ అన్నారు.

ప్రధాని మోడీ ముందుగా మూడు రోజుల పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌తో కలిసి ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన అమెరికా వెళ్తారు. ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మొదటిసారిగా అమెరికా పర్యటనకు వెళ్తున్నారు.

Read Also: Ranveer Allahbadia: ‘‘తల్లిదండ్రులు అది చేస్తుంటే చూస్తావా.?’’ యూట్యూబర్ అరెస్టుకి రంగం సిద్ధం..

“ఫ్రాన్స్ నుండి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు నేను రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తాను. నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్‌ను కలవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జనవరిలో ఆయన చారిత్రాత్మక ఎన్నికల విజయం, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మా మొదటి సమావేశం అయినప్పటికీ, భారతదేశం, అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడంలో ఆయన మొదటి పదవీకాలంలో కలిసి పనిచేయడం నాకు గుర్తుంది’’ అని ఆయన సందేశాన్ని తెలిపారు.

టెక్నాలజీ, వాణిజ్యం, రక్షణ మరియు శక్తితో సహా కీలక రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన మంచి అవకాశంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. వాషింగ్టన్‌లో ట్రంప్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన తర్వాత అక్కడ వ్యాపారవేత్తలు, ఇండియన్ కమ్యూనిటీతో మోడీ మాట్లాడనున్నారు. సుంకాలు విధిస్తానని, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పంపిస్తానని ట్రంప్ హెచ్చరిస్తు్న్న నేపథ్యంలో, మోడీ పర్యటన కీలకంగా మారింది.