Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్

  • నందిగ్రామ్‌లో బీజేపీ భారీ వ్యూహం
  • దివంగత పీఏ తల్లి హసిరాణి రథ్‌కు టికెట్
Nandigram Bypoll 2026

Nandigram Bypoll 2026

BJP Candidates for Bengal Bypolls 2026: పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలోకి దించింది. హైప్రొఫైల్ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి హసిరాణి రథ్‌ను అభ్యర్థిగా ప్రకటించగా.. రెజీనగర్ నియోజకవర్గం నుంచి సఖరావ్ సర్కార్‌కు టికెట్ ఇచ్చింది. నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన హసిరాణి రథ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శుభేందు అధికారి దివంగత పీఏ చంద్రనాథ్ రథ్ తల్లి. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే చంద్రనాథ్ రథ్ హత్యకు గురికావడంతో ఈ టికెట్ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

చంద్రనాథ్ రథ్ ఎవరు?

2026 మే 6న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత.. శుభేందు అధికారి అప్పటి పీఏగా పనిచేసిన చంద్రనాథ్ రథ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యంగ్రామ్‌లో కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత బీజేపీ నాయకత్వం ఆయన కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. చివరకు నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గంలో చంద్రనాథ్ రథ్ తల్లి హసిరాణి రథ్‌ను బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది.

హసిరాణి రథ్ ఎవరు?

62 ఏళ్ల హసిరాణి రథ్ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని చండీపూర్ ప్రాంతంలోని కులుప్ గ్రామానికి చెందినవారు. ఆమెకు స్థానిక రాజకీయాల్లో అనుభవం ఉంది. పంచాయతీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా కూడా పనిచేశారు. 2013 నుంచి 2018 వరకు చండీపూర్ పంచాయతీ సమితిలో శిశు, మహిళా అభివృద్ధి విభాగం కర్మాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. మొదట్లో ఆమె తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. అయితే శుభేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన తర్వాత హసిరాణి రథ్ కూడా బీజేపీలో చేరారు.

అధికారి కుటుంబంతో రెండు దశాబ్దాల అనుబంధం

రథ్ కుటుంబానికి శుభేందు అధికారి కుటుంబంతో సుదీర్ఘకాలంగా రాజకీయ, వ్యక్తిగత అనుబంధం ఉన్నట్లు సమాచారం. శుభేందు అధికారి రాజకీయ ప్రస్థానం ప్రారంభ దశ నుంచే రథ్ కుటుంబం ఆయనకు మద్దతుగా నిలిచింది. 2020 డిసెంబర్‌లో శుభేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సమయంలో హసిరాణి రథ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా బీజేపీలో చేరారు. అయితే హసిరాణి రథ్ గతంలో తాను 1998 నుంచే రాజకీయాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. హసిరాణి రథ్ భర్త 2024లో మరణించారు. ఇప్పుడు నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడంతో ఈ నియోజకవర్గ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

రెజీనగర్ నుంచి సఖరావ్ సర్కార్

మరోవైపు రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ సఖరావ్ సర్కార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న రెండు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. నందిగ్రామ్ నుంచి హసిరాణి రథ్‌ను బరిలోకి దించడం ద్వారా బీజేపీ స్థానిక రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.