Waqf Act: వక్ఫ్ సవరణ చట్టం-2025ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కి చెందిన ఎంపీ మొహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలు పిటిషన్లు దాఖలు చేయగా, పలు పార్టీలు కూడా పిటిషన్లు వేస్తున్నాయి. ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, డీఎంకే పార్టీ కూడా వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. డీఎంకే ఎంపీ ఏ రాజా పార్టీ తరుపున పిటిషన్ దాఖలు చేశారు. వక్ఫ్ చట్టంపై పలువురు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే, అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది.
Read Also: Mohan Bhagwat: ‘‘ ఔరంగజేబు వారసులుగా భావించే వారికి ప్రవేశం లేదు’’ ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరోవైపు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(AIMPLB) కూడా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ సంస్థ ప్రతినిధి ఎస్‌క్యూఆర్ ఇలియాస్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణలు ఏకపక్షంగా, వివక్షతో కూడుకున్నవని పిటిషన్‌లో పేర్కొన్నట్లు చెప్పారు. ఈ చట్టాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కింద ఉన్న ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే అని , వక్ఫ్‌ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలనే ఉద్దేశం స్పష్టంగా ఉందని, ముస్లిం మైనారిటీలు తమ సొంత మతపరమైన నిధులను వినియోగించకుండా అడ్డుకుంటుందని పిటిషన్ పేర్కొంది. కొత్తగా అమలులోకి వచ్చి వక్ఫ్ చట్టం ముస్లింల ప్రాథమిక హక్కులను తొలగిస్తుందని పిటిషన్ పేర్కొంది. ఈ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లతో పాటు ఇస్లామిక్ షరియా సూత్రాలకు విరుద్ధంగా ఉందని ముస్లిం లా బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.