Congress: కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తగిలింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ముంబై ప్రాంతంలో కీలక నేతగా ఉన్న బాబా సిద్ధిక్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఏ కారణంగా తాను పార్టీని విడిచిపెడుతున్నాడనే విషయాన్ని వెల్లడించలేదు. ‘‘ కాంగ్రెస్ పార్టీలో నాది 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ముంబైలో కీలక కాంగ్రెస్ నేతగా ఉన్న మిలింద్ దేవరా ఆ పార్టీకి రాజీనామా చేసి ఏక్ నాథ్ షిండే నేతృత్వలోని శివసేనలో చేరిన తర్వాత తాజాగా మరో నేత హస్తం నుంచి చేజారారు.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో సిద్ధిఖ్ చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్పిన తర్వా ఈ రాజీనామా ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 1న సిద్ధిఖ్, అజిత్ పవార్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత అతను ఎన్సీపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. బాంద్రా వెస్ట్ నుంచి మూడు సార్లు సిద్ధిఖ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సిద్ధిక్ 1999, 2004 మరియు 2009లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీలో ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ చేతిలో ఓడిపోయారు.