కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, బీజేపీ కీలక నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమి నుంచి ఉపరాష్ట్రపతి పోటీలో నిలిచేందుకే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఉపరాష్ట్రపతి పదవకి నఖ్వీ పోటీ చేస్తారని ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే తాజాగా నఖ్వీ రాజ్యసభ కాలపరిమితి రేపటితో ముగుస్తోంది. దీంతో ఆయన ఇటు రాజ్యసభ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు. నక్వీతో పాటు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆర్సీపీ సింగ్ బీజేపీ మిత్రపక్షం జనతాదల్(యూ) పార్టీకి చెందిన వ్యక్తి.
Read Also: Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ముక్తార్ అబ్సాస్ నఖ్వీ బీజేపీలో ఉన్న కొంతమంది ముస్లిం నాయకుల్లో ప్రముఖ వ్యక్తి. ప్రస్తుతం మోడీ క్యాబినెట్ లో ఉన్న ఏకైక ముస్లిం మంత్రి నఖ్వీనే. అయితే బీజేపీ కావాలనుకుంటే నఖ్వీ మంత్రి పదవిని అలాగే ఉంచి 6 నెలల్లో ఏదో ఒక సభ నుంచి ఎంపీగా చేసేది. అయితే అలా చేయలేదంటే.. ఉపరాష్ట్రపతి బరిలో నఖ్వీ ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. దీంతో పాటు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే పోటీలో నిలబెడుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే నఖ్వీ వైపే బీజేపీ మొగ్గుచూపించినట్లు తెలుస్తోంది.