ఉక్రెయిన్‌పై రష్యా భీకర రీతిలో యుద్ధం చేస్తోంది. ఈ కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొంతమంది భారతీయులు ఇంకా అక్కడే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు సురక్షితంగా తిరిగొస్తాడో, లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణం విడిచింది.
తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ ఉక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. కుమారుడి రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసింది. ఈ క్రమంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు కుమారుడిని కడసారి చూడకుండానే ఆమె తుదిశ్వాస విడిచింది. వీడియో కాల్ ద్వారా తన తల్లి మృతదేహాన్ని ఉక్రెయిన్‌లో ఉన్న కుమారుడు చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.