Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాల్లో 26/11 ముంబై ఉగ్రదాడులు ప్రధానాంశంగా మారాయి. కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉగ్రవాది అజ్మల్ కసబ్, ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేని చంపలేదని, ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న పోలీస్ చేశాడని ఆరోపించాడు. ప్రస్తుతం ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ఉజ్వల్ నికమ్‌ని ఉద్దేశిస్తూ దేశద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఉజ్వల్ నికమ్ కసబ్‌కి ఉరిశిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వాదించారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది.
Read Also: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ‘బ్లూ కార్నర్’ నోటీస్ జారీ.. ఈ నోటీసులు అంటే ఏమిటి..?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఈ రోజ ప్రతిపక్షాలు కసబ్ గురించి ఆందోళన చెందుతున్నాయి, ఉజ్వల్ నికమ్‌ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. ‘‘ ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ ప్రకారం, ఉజ్వల్ నికమ్ కసబ్‌ని అమానించాడు. కసబ్ ముంబై నగరాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. అతడి గురించి కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. కసబ్‌కి కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీ మద్దతు ఇస్తుంటే, బీజేపీ కూటమి మహాయుతి ఉజ్వల్ నికమ్‌కి మద్దతు ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి’’ అని ఫడ్నవీస్ అన్నారు.
బీజేపీ సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్‌ని ఈ స్థానం నుంచి తొలగించి ఉజ్వల్ నికమ్‌ని బీజేపీ పోటీలో నిలబెట్టింది. 26/11 ఉగ్రవాది కసబ్‌కి జైల్లో బిర్యానీ వడ్డించారని ఉజ్వల్ నికమ్ అబద్ధం చెప్పాడని కాంగ్రెస్ సీనియర్ నేత సుప్రియా శ్రీనాటే అన్నారు. అయితే, విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నుంచి కూడా విమర్శలు వచ్చాయి. 2008లో ముంబైపై దాడి చేసి 166 మందిని హతమార్చిన 10 మంది పాక్ ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా పట్టుబడ్డాడు. దాదాపు నాలుగేళ్లపాటు ముంబై జైలులో ఉంచిన అతడిని 2012 నవంబర్‌లో పూణేలో ఉరితీశారు.