భారత వ్యవసాయ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ ( ఐఎండీ). భారత్ లో వర్షాలకు అత్యంత కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. భారత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు ప్రారంభం అయినా.. మొదటి, రెండో వారంలో రుతుపవనాలు ఎక్కువ శాతం విస్తరిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మే చివరి నాటికే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.
ప్రస్తుతం దేశంలో వేసవి తీవ్రత, వడగాలులు ఎక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటుతున్నాయి. అయితే రుతుపవనాల ఎంట్రీ వల్ల ఉష్ణోగ్రతలు దాదాపుగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. వేసవి తాపం నుంచి రుతుపవనాలు ఊపశమనం ఇవ్వనున్నాయి.
ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాల వల్ల అండమాన్, నికోబార్ దీవుల్లో మే 15 నాటికి మొదటి తొలకరి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సాధారణ అంచనా తేదీ కన్నా నాలుగు రోజులు ముందుగానే… ఈక్వటోరియల్ గాలుల కారణంగా దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో మే 15 నాటికి నైరుతి రుతుపవనాలు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది దేశంలో 99 శాతం వర్షపాతం నమోదు అవుతుందని ఐఎండీ వెల్లడించింది.