Site icon NTV Telugu

Mohan Bhagwat: కుక్కల బెడదపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Mohan Bhagwat

Mohan Bhagwat

దేశ వ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డాగ్ లవర్స్‌ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇప్పటికీ అనుకూల-వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవులు, జంతువులు, ప్రకృతి సామరస్యంగా జీవించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమతుల్య సహజీవనాన్ని ఎలా నడిపించుకోవాలో సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Bangladesh Poll Results: తారిక్ రెహమాన్‌‌దే బంగ్లాదేశ్

గురువారం నాగపూర్‌లో ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కానైన్ ప్రాక్టీస్ మరియు మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ యూనివర్సిటీ (MAFSU) సంయుక్తంగా నిర్వహించిన ‘ఒక ఆరోగ్యంలో కుక్కల పాత్ర.. భాగస్వామ్యాన్ని నిర్మించడం-సవాళ్లను పరిష్కరించడం’’ అనే అంశంపై జరిగిన జాతీయ సింపోజియంలో మోహన్ భగవత్ ప్రసంగించారు.

‘‘ఇటీవల కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఢిల్లీలో పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ అంశంపై రెండు వెర్షన్స్ వినిపించాయి. ఒక వర్గం కుక్కలను చంపాలని.. ఇంకొక వర్గం అసలు ముట్టుకోకూడదు అని. దీని గురించి నన్ను అడిగినప్పుడు మధ్య మార్గం కూడా ఉండొచ్చని చెప్పాను. కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ వంటి చర్యలు ఉపయోగించవచ్చు. ప్రమాదాలను తగ్గించడానికి.. భ్రదత కోసం అనేక చర్యలు తీసుకోవచ్చు. నేను పశువైద్యుడిని కాబట్టి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.’’ అని అన్నారు.

‘‘గతంలో పశువైద్యులకు చాలా పరిమితి ఉందని నమ్మాం. కానీ అది నిజం కాదు. మనం చాలా విస్తృత స్థాయిలో ఆలోచించాలి. కచ్చితంగా ప్రత్యేక పశువైద్య మండలి ఉండాలి. అది అవసరం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. జంతువుల గురించి నిర్ణయాలు తీసుకోవాలంటే.. వాటి గురించి తెలిసిన పశువైద్యులను గానీ.. జంతు శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి. జంతువులు గురించి అవగాహన వారికి ఉంటుంది. అవసరమైన జ్ఞానం వారికే ఉంటుంది కాబట్టి వారికి బాధ్యతలు అప్పగించాలి. ఇప్పుడు క్రీడల విషయంలో ఏం జరుగుతుంది. క్రీడా రంగానికి చెందిన వ్యక్తులే నిర్ణయం తీసుకుంటారు. అలాగే జంతువుల విషయంలో పశువైద్యులకే అవగాహన ఉంటుంది. కాబట్టి పశువైద్యుల్ని సంప్రదించి ఆ రంగాన్ని ముందుకు నడిపిస్తే.. అప్పుడు పురోగతి లభిస్తుంది.’’ అని
మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

Exit mobile version