అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీతో కీలక సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’లో జరిగిన ఈ భేటీ గంటకుపైగా కొనసాగింది. శనివారం ఉదయం కోల్‌కతాలో పర్యటించిన అనంతరం నేరుగా ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడీని కలిశారు. ఈ సమావేశంలో అజిత్ దోవల్, జైశంకర్, ఇక భారత్‌లో అమెరికా రాయబారి అయిన సెర్గియా గోర్ పాల్గొన్నారు. ఇక గతేడాది అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూబియో భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక భేటీకి సంబంధించిన వివరాలను సెర్గియా గోర్ ఎక్స్‌లో వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ‘‘ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో రూబియోతో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతికత రంగాల్లో అమెరికా-భారత సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము ఫలప్రదమైన చర్చలు జరిపాం. ఈ చర్చలు రెండు దేశాలను పటిష్టం చేయడంతో పాటు, స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత పురోగతికి దోహదపడతాయి. అమెరికాకు భారతదేశం ఒక అత్యంత కీలకమైన భాగస్వామి!.’’గా పేర్కొన్నారు.
ఇక శనివారం ఉదయం కోల్‌కతా చేరుకున్న మార్కో రూబియో అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక రంగాల్లో సహకారం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.
అలాగే ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రక్షణ రంగ సహకారం పెంపు, ఇంధన భద్రత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలపై కూడా ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
ఇక మార్కో రూబియో ఆదివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమగ్ర చర్చలు జరపనున్నారు. అనంతరం సోమవారం ఆగ్రా, జైపూర్ నగరాల్లో పర్యటించి మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు.
గత కొంతకాలంగా భారత్-అమెరికా సంబంధాల్లో కొన్ని విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధించడం, హెచ్1బీ వీసా ఫీజుల పెంపు, అలాగే భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.
అయితే ఇటీవల రెండు దేశాలు సంబంధాల మెరుగుదల కోసం చురుకైన చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే గత నెల అమెరికాలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మూడు రోజుల పాటు కీలక చర్చలు జరిపారు. అలాగే ఏప్రిల్ 14న ప్రధాని మోడీ, ట్రంప్ మధ్య దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Great to join @SecRubio for a meeting with Prime Minister @narendramodi. We had a productive discussion on ways to deepen U.S.-India cooperation across security, trade, and critical technologies – areas that strengthen both our nations and advance a free and open Indo-Pacific.… pic.twitter.com/0bO3d7jYTa
— Ambassador Sergio Gor (@USAmbIndia) May 23, 2026

