Delimitation Bill: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘డీలిమిటేషన్’’ బిల్లును ఆమోదింపచేసుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. జూలై 20న ప్రారంభం కాబోయే సమావేశాలకు ముందే మద్దతు కూడగట్టేలా ప్లాన్ చేస్తోంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. 360 మంది ఎంపీల మద్దతును ఎన్డీయే సర్కార్ సాధించాల్సి ఉంది. అయితే, ఈ మెజారిటీ మార్కుకు 6 మంది సభ్యుల దూరంలో బీజేపీ ఉంది. ఏప్రిల్‌లో నిర్వహించిన ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ ఈ బిల్లును ప్రవేశపెట్టినా మెజారిటీ సాధించడంలో విఫలమైంది.
ప్రస్తుతం మోడీ సర్కార్ ‘‘మిషన్ 360’’ని ప్రారంభించింది. మోడీ ప్రభుత్వం జూలై 19న ఆల్ పార్టీ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ప్రతిపక్ష పార్టీల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, వర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ వరసగా సమావేశాలు నిర్వహిస్తోంది. గత వారం రోజులుగా బీజేపీ నాయకత్వం పలు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో కూడా ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ హాజరయ్యారు.
సంఖ్యాబలం లెక్క ఇదే..
లోక్‌సభలో మొత్తం 543 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలంటే 360 ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీయేకు గత ఎప్రిల్ నెలలో 298 మంది ఎంపీలు మద్దతు ఇచ్చారు. స్వయంగా ఎన్డీయే సర్కార్‌కు 293 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు, టీఎంసీ రెబెల్ ఎంపీలు 20 మంది, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు పొందగలిగితే డీలిమిటేషన్ బిల్లుకు మార్గం సుగమం అవుతుంది. ఈ రెండు పార్టీలు కూడా మద్దతు ఇస్తాయనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు ఇటీవల షిండే శివసేనలో చేరారు. శరద్ పవార్‌కు చెందిన 8 మంది ఎంపీలు కూడా మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల సుప్రియా సూలే వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తు్న్నాయి. ఇక ఉద్ధవ్ పార్టీకి మిగిలిన ముగ్గురు ఎంపీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. అవసరమైన సవరణలు చేస్తే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. దీంతో 360 ఫిగర్‌కు మరో ముగ్గురు ఎంపీల దూరంలో ఉంది.
ఇదిలా ఉంటే, ఎంపీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ నాయకత్వం చురుకుగా పనిచేస్తోంది. హోంమంత్రి అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లో భేటీ అయ్యారు. మరోవైపు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షిండే వర్గంలో చేరిన ఆరుగురు ఎంపీలతో విడివిడిగా సమావేశమయ్యారు.

