Mood of the Nation survey: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హ్యట్రిక్ కొట్టబోతోందని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే అంచనా వేసింది. మరోసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నట్లు చెప్పింది. 2024 ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఈ సర్వే చర్చనీయాంశంగా మారింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కమాండింగ్ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే, బీజేపీ చెబుతున్న 400 స్థానాల కన్నా తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో 35,801 మంది అభిప్రాయాలతో, డిసెంబర్ 15, 2023 మరియు జనవరి 28, 2024 మధ్య సర్వేని నిర్వహించారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 335 సీట్లు వస్తాయని, మరోసారి అధికారాన్ని నిలుపుకుంటుందని, మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువ సీట్లను సునాయాసంగా సాధిస్తుందని సర్వే అంచానా వేసింది. అయితే, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 18 సీట్లు కోల్పోతున్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉంటే, ఇండియా కూటమి 166 స్థానాలను సాధిస్తుందని సర్వే వెల్లడించింది.
Read Also: Viral Video: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. విండో కోసం గొడవ..
543 స్థానాల్లో బీజేపీ సింగిల్‌గా 304 స్థానాలను కైవసం చేసుకుంటుందని, 2019లో సాధించిన 303 స్థానాల కన్నా ఒక సీటుని ఎక్కువగానే గెలుస్తుందని అంచనా. కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా 19 స్థానాలను అధికంగా గెలుచుకుని, మొత్తంగా 71 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు తెలిపింది. 168 స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు విజయం సాధిస్తారని అంచనా వేసింది.
రామ మందిర విషయాన్ని మోడీ పాలనలో అత్యంత ప్రధాన అంశంగా ప్రజలు భావిస్తున్నారు. 42 శాతం మంది దీనిని గుర్తించారు. 19 శాతం మంది ప్రధాని మోడీ ప్రపంచంలో భారత్ స్థాయిని పెంచారని, 12 శాతం మంది ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం వంటివి బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నట్లు సర్వేలో ప్రజలు వెల్లడించారు. అవినీతిరహిత పాలనకు 14 శాతం క్రెడిట్స్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, ఉత్తర భారత దేశంలో బీజేపీకి తిరుగు లేకుండా ఉంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో బీజేపీ పలు రాష్ట్రాలను క్లీన్ స్వీప్ చేస్తోందని సర్వే చెబుతోంది. నార్త్‌లో 180 స్థానాలకు గానూ ఎన్డీయే 154, ఇండియా కూటమి 25 స్థానాల్లో, సౌత్‌లో 132 స్థానాల్లో ఎన్డీయేకి 27, ఇండియా కూటమికి 76, తూర్పు ప్రాంతంలో 153 స్థానాల్లో ఎన్డీయేకి 103, ఇండియా కూటమికి 38, పశ్చిమాన 78 స్థానాల్లో ఎన్డీయేకి 51, ఇండియా కూటమికి 27 స్థానాలు వస్తాయని సర్వే వెల్లడించింది.