Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అధికారంలో ఉన్న కర్ణాటకలో దారుణంగా దెబ్బతింది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కోల్పోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీజేపీ-జేడీఎస్ కూటమి 4 ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంది.
కర్ణాటక:
కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయింది. దీంతో బెంగళూర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పుట్టన్నపై విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న ఈ స్థానం ఇప్పుడు ఎన్డీయే కూటమిలో చేరింది. మిగిలిన నార్త్ ఈస్ట్ టీచర్స్, వెస్ట్ గ్రాడ్యయేట్స్, సౌత్ ఈస్ట్ గ్రాడ్యుయేట్స్ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల్లో కాంగ్రెస్‌కు ‘‘జీరో’’..
కర్ణాటకతో పాటు యూపీ, బీహార్, మహారాష్ట్రల్లో కూడా కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. యూపీలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే బీజేపీ, సమాజ్‌వాదీ(ఎస్పీ) మధ్య పోటీ నెలకొంది. మీరట్, బరేలీ-మొరాదాబాద్, లక్నో స్థానాలను బీజేపీ నిలబెట్టుకుంది. వారణాసి టీచర్స్, ఆగ్రా టీచర్స్ స్థానాల్లో ఎస్పీ విజయం సాధించింది. మిగిలిన స్థానాల ఫలితాలు తేలాల్సి ఉంది.
బీహార్‌లో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా, నాలుగు ఉపాధ్యాయ స్థానాలను ఆర్జేడీ (పాట్నా), బీజేపీ (తిర్హుత్), జన్ సూరజ్ (దర్భంగా), ఒక స్వతంత్ర అభ్యర్థి (శరణ్) గెలుచుకోగా, పాట్నా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థి నీరజ్ కుమార్ విజయం సాధించారు.
మహారాష్ట్రలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ, శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు పలు స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యతను కనబరుస్తోంది.
కాంగ్రెస్‌కు డేంజర్ బెల్స్..
కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక డేంజర్ సిగ్నల్‌గా భావించాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం, ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమయంలోనే ఈ ఫలితాలు వెలువడ్డాయి. ప్రతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలపై నిందలు వేసే కాంగ్రెస్ నాయకులు, బ్యాలెట్ పేపర్స్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడ్డారు. అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా ఒక్క ఎమ్మెల్సీ సీటు కూడా గెలుచుకోలేకపోవడం సంచలనంగా మారింది.

