DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?

  • డీఎంకే, కాంగ్రెస్ మధ్య పెరుగుతున్న దూరం..
  • ఎస్ఐఆర్ విషయంలో కాక్రోచ్ పార్టీకి స్టాలిన్ మద్దతు..
  • త్వరలో అభిజిత్ దీప్కేను కలిసే అవకాశం..
  • థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న డీఎంకే.
Mk Stalin

Mk Stalin

DMK:  డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, టీవీకే గెలిచిన తర్వాత డీఎంకేను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ పక్షాన చేరారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ వెన్నుపోటుగా డీఎంకే వర్ణిస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలు చేస్తున్న కాంగ్రెస్‌కు డీఎంకే దూరం పాటిస్తూనే.. SIR, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ లకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి మద్దతు తెలుపుతోంది.

కాంగ్రెస్‌కు కటీఫ్..

చెన్నైలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఎస్ఐఆర్‌ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలపాలని, సీజేపీకి మద్దతు ఇవ్వాలని పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ తన ఎంపీలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో తమకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని డీఎంకే శ్రేణులకు స్టాలిన్ స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ ‘‘ద్వంద్వ వైఖరి’’ని అవలంభిస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది.

సీజేపీకి మద్దతుగా స్టాలిన్..

ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా సీజేపీకి మద్దతుగా ఎక్స్ వేదికగా స్టాలిన్ పలు పోస్టులు పెడుతున్నారు. సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే, కో కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ నిర్బంధాలపై ఆయన స్పందించారు. దీప్కే నిర్భందాన్ని వ్యతిరేకించారు. కేంద్రం అణిచివేత చర్యలకు వ్యతిరేకంగా నిరసనల్ని మరింత బలోపేతం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. దీప్కే, నేహా బోరాలను నిర్బంధించడం చట్టవిరుద్ధమని, కేంద్రం వారిని తక్షణమే విడుదల చేయాలని ఎక్స్ పోస్టులో డిమాండ్ చేశారు.

థర్డ్ ఫ్రంట్ దిశగా డీఎంకే..

గత కొన్ని రోజులుగా డీఎంకే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ కనిమొళి, శరద్ పవార్ ఎన్సీపీ, టీఎంసీలతో భేటీ అయ్యారు. ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమికి దూరంగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ కూటమిలోకి సీజేపీని కూడా ఆహ్వానిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే కొన్ని రోజుల్లో అభిజిత్ దీప్కేను స్టాలిన్ కలవచ్చనే నివేదికలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో గెలిచిన విజయ్ టీవీకే, ఓడిపోయిన డీఎంకే రెండు కూడా ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తుండటం గమనార్హం.