West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మైనర్ బాలిక కిడ్నాప్, హత్య సంచలనంగా మారింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో కోచింగ్ క్లాస్‌కి హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక హత్యకి గురైంది. ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిరసనకారులు బాలిక హత్యకు నిరసనగా పోలీస్ స్టేషన్‌ని ధ్వంసం చేసి తగులబెట్టారు. అయితే, బాలికపై అత్యాచారం జరిపి హత్య చేశారని బీజేపీతో సహా బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు బాలిక పోస్టుమార్టం నివేదిక కోసం వేచిచూస్తున్నారు.
ఈ హత్య నేపథ్యంలో బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆగస్టులో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన బెంగాల్‌నే కాకుండా యావత్ దేశాన్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. మమతా బెనర్జీ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజాగా బాలిక హత్య ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
READ ALSO: Jaishankar: ‘నేను వెళ్తున్నాను కానీ…’ పాకిస్థాన్‌కు వెళ్లే ముందు విదేశాంగ మంత్రి కీలక ప్రకటన
మైనర్ బాలిక శుక్రవారం మహిషామరిలోని కోచింగ్ క్లాస్‌కి హాజరయ్యేందుకు వెళ్లింది. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె మృతదేహం శనివారం తెల్వారుజామున 3.30 గంటల ప్రాంతంలో పొలంలో గాయాలతో కనిపించింది. బాలిక హత్యపై స్థానికులు నిరసనకు దిగారు. పోలీస్ శిబిరానికి నిప్పు పెట్టారు. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తానని తన కూతురు చెప్పిందని బాలిక తండ్రి చెప్పారు. ఆమె తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
19 ఏళ్ల మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడు బాలికను కిడ్నాప్, హత్య చేసినట్లు అనుమానిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. బాలికపై అత్యాచారం జరిగిందని కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆరోపించారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దుర్గాపూజ వేడుకులకు జరుగుతున్న సమయంలో అమాయకపు బాలికలు బలిపశువులుగా మారుతున్నారని, రాష్ట్రంలో పరిపాలనపై మమతా బెనర్జీకిన నియంత్రణ లేదని, ఈ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన తీరు బెంగాల్‌లో పరిస్థితికి అద్దం పడుతోందని, వెంటనే మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, ఆమె పదవిలో కొనసాగే హక్కు లేదని సుకాంత అన్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు అత్యాచారాన్ని నిర్ధారించలేమని పోలీసులు తెలిపారు.