Deepfake Issue: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరా పటేల్ అనే ఒక బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ నల్లటి దుస్తులు ధరించి లిఫ్టులోకి ప్రవేశించే వీడియోలో డీప్‌ఫేక్ వీడియోలో రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోపై చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో సహా చిత్ర పరిశ్రమ రష్మికకు మద్దతుగా నిలిచారు.
Read Also: Air India: ఖలిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులు.. పంజాబ్, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం..
ఇదిలా ఉంటే ఇది వివాదం కావడంతో రష్మిక వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇలా డీప్‌ఫేక్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఐటీ నిబంధనల ప్రకారం, కేసులు నమోదు చేసి పరిష్కారం పొందాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధించడం ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారమ్‌ల చట్టపరమైన బాధ్యత అని రాజీవ్ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
యూజర్స్, ప్రభుత్వ అథారిటీ నుంచి నివేదికలు అందిన 36 గంటల్లో అటువంటి కంటెంట్‌ను తప్పనిసరిగా తీసేయాలని ఆయన తెలిపారు. ఇందులో విఫలమైనే సదరు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటీ చట్టంలోని రూల్ 7 ప్రకారం బాధితులైన వ్యక్తులు కోర్టులను ఆశ్రయిస్తారని, ఈ ముప్పును ఎదుర్కొవడానికి ఫ్లాట్‌ఫారమ్స్ చురుకైన చర్యలు తీసుకోవడం అత్యవసరమని మంత్రి వెల్లడించారు. పౌరుల భద్రత, విశ్వాసాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయని తెలిపారు. డీప్‌ఫేక్‌ల సృష్టించడం, సర్క్యులేషన్‌కు రూ. 1 లక్ష జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని కేంద్రం తెలిపింది.