పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దును మూసేసింది. ఇలా ఒక్కొక్క దెబ్బకొడుతూ వెళ్తోంది. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
తాజాగా జమ్మూకాశ్మీర్‌లో సర్వసన్నాహాకాలు జరుగుతున్నాయి. సరిహద్దు తీవ్రవాదం నేపథ్యంలో సర్వసన్నాహక చర్యలు తీసుకుని సిద్ధంగా ఉండాలని కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులకు స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. ఈ మేరకు జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సర్క్యులర్ జారీ చేశారు.
ఆస్పత్రి సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని సర్క్యులర్‌లో సూచించారు. ఏ క్షణంలోనైనా.. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోని స్టోర్ కీపర్‌లో అవసరమైన అన్ని అవ్యవసర మందులు, కీలకమైన పరికరాలు, ఇతర కావాల్సిన సామాన్లు సమకూర్చుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకూడదని.. విధులకు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని హెచ్చరించారు. విధులు నిర్వర్తిస్తున్న వేళల్లో సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రి ప్రాంగణంలోనే ఉండాలని సూచించారు.
ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అంతరాయం లేకుండా.. మరింత సమర్థవంతంగా మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపింది. అంతేకాకుండా అన్ని అత్యవసర పరిస్థితుల్లోనూ వెంటనే స్పందించేలా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని పేర్కొంది. అత్యవసర వైద్య సహాయం కోసం ఎవరైనా సంప్రదిస్తే 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లో ఏర్పాట్లు చేయాలని స్పస్టం చేసింది. ఇదే తరహాలో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వాస్పత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇక కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్లు ఇవే.. 0191-2582355 0191-2582356 .