CJI Justice NV Ramana: ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోందని మండిపడ్డారు. కొన్ని సమయాల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయించడం కష్టమని.. ఆ తీర్పులను మీడియా ఇస్తోందన్నారు. న్యాయం అందించడానికి సంబంధించిన సమస్యలపై అవగాహన లేని, ఎజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరమని జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధ్యతలను అతిక్రమించి, ఉల్లంఘించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారన్నారు. ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయిలో జవాబుదారీతనం ఉందని.. అయితే ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదని అన్నారు. ఇటీవల న్యాయమూర్తులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయని.. ఎటువంటి రక్షణ లేకుండానే జడ్జిలు సమాజంలో జీవించాల్సి వస్తోందన్నారు. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు వారి ఉద్యోగాల సున్నితత్వం కారణంగా పదవీ విరమణ తర్వాత కూడా తరచుగా భద్రత కల్పిస్తారు. హాస్యాస్పదంగా న్యాయమూర్తులకు ఇదే తరహా రక్షణ లేకుండా పోయిందన్నారు.
Arvind Kejriwal: ఢిల్లీలో ‘ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్’ కార్యక్రమం
నిర్ణయాత్మక కేసుల్లో మీడియా విచారణ సరైంది కాదన్న జస్టిస్ ఎన్వీ రమణ.. బేధాభిప్రాయాలను ప్రచారం చేస్తున్న మీడియా ప్రజల్లో వైరుధ్యాన్ని పెంచుతోందన్నారు. దీంతో ప్రజాస్వామ్యం బలహీనపడుతోందన్నారు. ఈ క్రమంలో న్యాయవ్యవస్థపై పెను ప్రభావం పడుతోందన్నారు. సోషల్ మీడియా పరిస్థితి మరీ దారుణంగా ఉందని సీజే అన్నారు. స్వీయ నియంత్రణతో మీడియా ఉండాలని ఆయన కోరారు. పదాలను మీడియా జాగ్రత్తగా వాడాలన్నారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రజలను విద్యావంతులను చేసేందుకు, చైతన్యపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తన గళాన్ని వాడుకోవాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.