Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవ వేడుక కోసం భారతదేశం ముస్తాబవుతోంది. ముఖ్యంగా అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
ఇదిలా ఉంటే హిందూ జనాభా, భారతీయ మూలాలు ఎక్కువగా ఉన్న ఆఫ్రికాలోని మారిషస్ దేశ ప్రభుత్వం రామాలయ వేడుక నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ సమాజం నుంచి వచ్చిన అభ్యర్థన మేరరు మారిషన్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్ నేతృత్వంలోని మంత్రుల మండలి శుక్రవారం సమావేశమైంది. రామాలయ ప్రారంభోత్సవ వేడుక నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రజల అభ్యర్థనపై సానుకూల నిర్ణయం తీసుకుంది. వేడుకల్లో పాల్గొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also:Hanuman: చేసిన ప్రామిస్ ను నిలబెట్టుకున్న హనుమాన్ టీమ్.. అయోధ్య రామ మందిరానికి విరాళం
జనవరి 22, 2024న అధికారులకు రెండు గంటల విరామం ఇవ్వాలని హిందూ సామాజిక-సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్ ప్రభుత్వం ఆమోదించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు అధికారులకు విరామం ఇవ్వనుంది. 2011 గణాంకాల ప్రకారం, హిందూ మతం మారిషస్ ప్రధాన మతంగా ఉంది. అక్కడ 48.5 శాతం మంది హిందు మతాన్ని అనుసరిస్తున్నారు. నేపాల్ తర్వాత హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మారిషన్ మూడో స్థానంలో ఉంది.
బ్రిటీష్ కాలంలో భారత్ నుంచి చాలా మందిని మారిషస్‌లో ఫ్రెంచ్, బ్రిటీష్ వారి తోటల్లో పనిచేయించుకునేందుకు తీసుకెళ్లారు. కాలక్రమేణా వారు అక్కడే స్థిరపడిపోయారు. ఎక్కువగా ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి భారతీయ రాష్ట్రాల నుండి మారిషస్ వెళ్లారు.