విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మార్గరెట్ అల్వా.. ఈరోజు పార్లమెంట్‌లో అల్వా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే, సీతారాం ఏచూరి ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నిక ఆగస్టు 6వ తేదీ నిర్వహించనున్న విషయం తెలిసిందే.. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగియనుంది..
Read Also: Revanth Reddy : రాజకీయ క్రీడలో విలువైన ధాన్యం నీళ్లపాలైంది
ఇక, నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన మార్గరెట్ అల్వా… ఇది నిస్సందేహంగా కఠినమైన ఎన్నికలే, కానీ, సవాలును స్వీకరించడానికి నేను భయపడను అని స్పష్టం చేశారు.. తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన ప్రతిపక్షాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 80 ఏళ్ల అల్వా.. అధికార ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌పై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ అయిన అల్వాను ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఆదివారం ఏకగ్రీవంగా ప్రకటించారు. మరోవైపు.. తనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఖరారు చేయడంతో.. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు జగదీప్ ధన్‌కర్.. ఇప్పటికే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఇక, భారత రాష్ట్రపతి ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సోమవారం ముగిసిన విషయం తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి చేర్చారు.. ఈ నెల 21వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం చేయనున్నారు.