Nipah virus: నిపా వైరస్ కారణంగా కేరళలో ఒక వ్యక్తి మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మరణించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. 24 ఏళ్ల వ్యక్తి మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రీజనల్ మెడికల్ ఆఫీసర్ డెత్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిఫా ఇన్ఫెక్షన్ అనుమానం తలెత్తిందని వీణా జార్జ్ చెప్పారు. వ్యక్తి నమూనాలను వెంటనే పరీక్ష కోసం పంపామని, అందులో నిపా పాజిటివ్‌గా తేలిందని ఆమె వెల్లడించారు.
బెంగళూర్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న మలప్పురానికి చెందిన వ్యక్తి సెప్టెంబర్ 09న మరణించాడు. ఈ మరణం తర్వాత నిఫా ఉన్నట్లు తేలడంతో ఆరోగ్యమంత్రి నేతృత్వంలో అత్యున్నత సమావేశం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యల్ని ప్రారంభించారు. కోజికోడ్ వైద్య కళాశాల నిఫాగా నిర్ధారించిన తర్వాత, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) ఇవే ఫలితాలను వెల్లడించింది.
Read Also: Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ నెంబర్-1 టెర్రరిస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
శనివారం రాత్రి 16 కమిటీలను ఏర్పాటు చేశామని, 151 మందితో కాంటాక్ట్ లిస్ట్‌ని గుర్తించామని మంత్రి వెల్లడించారు. మరణించిన వ్యక్తి తన స్నేహితులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఇతడితో సన్నిహితంగా మెలిగిన వారిలో ఐదుగురికి చిన్నపాటి జ్వరం, ఇతర లక్షణాలు కనుగొనబడ్డాయని, వీరిని ఐసోలేషన్‌లో ఉంచామని మంత్రి చెప్పారు.
అంతకుముందు జూలై 21న నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఒక బాలుడు మరణించాడు. ఇదే రాష్ట్రంలో తొలి కేసు. 2018, 2021 మరియు 2023లో కోజికోడ్ జిల్లాలో మరియు 2019లో ఎర్నాకుళం జిల్లాలో నిపా వ్యాప్తి నమోదైంది మరియు కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి, మలప్పురం మరియు ఎర్నాకులం జిల్లాల్లోని గబ్బిలాలలో నిపా వైరస్ యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించబడింది.