Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నిన్న వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ మరోసారి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్‌ని నమ్మేది లేదని, వాటిని బహిష్కరిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ మోసపూరిత వ్యూహాలకు లొంగకుండా పార్టీ కార్యకర్తలు బలంగా ఉండాలని కోరారు. తాము 2016, 2019, 2021లో చూసినట్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుగా ఉన్నాయని, దీనికి కారణంగా తుది ఫలితాలను తారుమారు చేయడానికి గోడి మీడియాకు భారీ మొత్తాన్ని బీజేపీ చెల్లిస్తోందని వ్యాఖ్యానించారు.
Read Also: Prajwal Revanna Case: ప్రజ్వల్ కేసులో ఐఫోన్ సర్వర్ యాక్సెస్ కోరుతున్న పోలీసులు.. కారణం ఏంటంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే వంటి ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరు కనబరుస్తాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2016, 2019, 2021లో ఎగ్జిట్ పోల్స్ చూశామని, ఇది అసలైన ఫలితాలతో సరిపోలలేదని చెప్పారు. బీజేపీ వీటిని తయారు చేసి మీడియాకు ఇస్తుందని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కన్నా బీజేపీకి ఈ సారి ఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీని తర్వాత మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 21-24 సీట్లు గెలుచుకుంటుంది. టీఎంసీ 18-21 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇండియా టీవీ పోల్ ప్రకారం ఎన్డీయేకు 22-26 సీట్లు, టీఎంసీకి 14-18 సీట్లు, కాంగ్రెస్‌కు 1-2 సీట్లు వస్తాయని చెప్పింది. ఏబీపీ న్యూస్-సీఓటర్ ప్రకారం.. బీజేపీకి 23-27 సీట్లు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్‌కు 13-17 సీట్లు వస్తాయని అంచనా.ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకారం, బీజేపీకి 26-31 సీట్లు, టీఎంసీకి 11-14 సీట్లు, ఇండియా కూటమికి 0-2 సీట్లు వస్తాయని పేర్కొంది.