Didi vs ED: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కోల్‌కతాలో ఐ-ప్యాక్ కార్యాలయం, ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ సోదాలు జరుగుతున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన ఘటనా స్థలానికి రావడం, ఐ ప్యాక్ ఆఫీసుల నుంచి కీలకమైన కొన్ని ఫైళ్లను తీసుకెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాలపై ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి ఒక ల్యాప్‌టాప్, అతడి ఫోన్, పలు పత్రాలు తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది. సీఎం దర్యాప్తుకు అంతరాయం కలిగిస్తున్నారని, బొగ్గు స్మగ్లింగ్ మనీలాండరింగ్‌లో పాలుపంచుకునన్న వారికి మద్దతు ఇస్తున్నారని ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై కోర్టు రేపు విచారణ జరిపే అవకాశం ఉంది.
Read Also: Devendra Fadnavis: ముంబై మేయర్ పీఠం మరాఠా హిందువుదే..
అయితే, ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని, బీజేపీ, అమిత్ షా చేయించిందని మమతా బెనర్జీ ఆరోపించింది. మరోవైపు, ఈ సోదాలు సాక్ష్యాధారాల ఆధారంగా జరిగాయని, ఏ రాజకీయ సంస్థను లక్ష్యంగా చేసుకోలేదని ఈడీ చెబుతోంది. ఈ దాడి సమయంలో ముఖ్యమైన పత్రాలు చోరీకి గురయ్యాయని ఆరోపిస్తూ ప్రతీక్ జైన్ కుటుంబం కూడా ఈడీపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. బెంగాల్ సీఎం, పోలీసులు వచ్చే వరకు సోదాలు శాంతియుతగా జరిగాయి. వారు వచ్చిన తర్వాత భౌతిక పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తొలగించారని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. మమతా బెనర్జీ, ఆమె సిబ్బంది, రాష్ట్ర పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారని, ఇది మనీలాండరింగ్ దర్యాప్తు, విచారణకు ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది.
ఈ సోదాలపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎన్నికల వ్యూహాలను బీజేపీ దొంగిలసి్తోందని అన్నారు. మా పార్టీ డేటా, ల్యాప్‌టాప్, ఐఫోన్, ఎస్ఐఆర్ సహా పార్టీ ఎన్నికల వ్యూహాలను తీసుకున్నారని, వారు మా టాక్స్ పేపర్స్, బ్యాంక్ ఖాతాలను తీసుకున్నారని, ఇది నేరం కాదా? అని ప్రశ్నించారు. తాము న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. తాము సౌమ్యులం అని, మేము సంయమనం పాటిస్తామని, కానీ నాకు బాధ కలిగిస్తే, నేను మౌనంగా ఉండనని మమతా బహెచ్చరించారు.