Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవ్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనిక ఉనికిని ఉపసంహరించుకోవాలని భారత్‌ని కోరింది. ఇండియా వ్యతిరేక ధోరణితో పదవికి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ, ద్వీపదేశంలోని భారత సైనికులు విడిచివెళ్లాలని కోరుతున్నాడు. తాజాగా మరోసారి తమ దేశం నుంచి భారత్ తమ సైనికులను మార్చి 15లోపు ఉపసంహరించుకోవాలని మాల్దీవ్స్ కోరింది. చైనాతో సంబంధాల కోసం మొగ్గు చూపుతూ.. భారత వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్నాడు. మయిజ్జూ చైనా పర్యటనకు వెళ్లొచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ముయిజ్జూ ఎన్నికల ప్రచారం కూడా ‘ఇండియా అవుట్’ నినాదంతో సాగింది. తమ దేశ సార్వభౌమాధికారం కోసం కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్న ప్రస్తుతం గవర్నమెంట్, చైనాతో అంటకాగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో భారత్ ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్ క్యాన్సల్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే చైనా పర్యటన నుంచి వచ్చి మహ్మద్ ముయిజ్జూ.. తమను వేధించే హక్కు ఏ దేశానికి లేదని, తాము ఎవరి బ్యాక్ యార్డ్ కామని ఇండియాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మేము చిన్నవాళ్లమైనా.. తమను బెదిరించే లైసెన్స్ ఏ దేశానికి లేదని మీడియా సమావేశంలో వ్యక్తం చేశారు.