Major Terror Plot Foiled in J&K: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం.. ముగ్గురు లష్కరే అనుచరుల అరెస్ట్..!

Major Terror Plot Foiled In

Major Terror Plot Foiled In

Major Terror Plot Foiled in J&K: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. తాజాగా షోపియాన్ జిల్లాలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT)కు చెందిన ముగ్గురు అనుచరులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి వద్ద నుంచి గ్రెనేడ్లు, ఏకే-47 తుపాకీకి సంబంధించిన బుల్లెట్లు సహా భారీగా ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

షోపియాన్ జిల్లాలోని నర్వావ్, రావల్పోరా ప్రాంతాల్లో పోలీసులు, ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్ సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించాయి. ఈ తనిఖీల్లో లష్కరే తోయిబా అనుచరులుగా అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని షోపియాన్‌లోని అవెండ్ ప్రాంతానికి చెందిన అబ్రార్ అహ్మద్ మీర్, దాచిపోరాకు చెందిన రసిక్ అహ్మద్ భట్, సుహైల్ అహ్మద్ లోన్‌గా గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, ఏకే-47 తుపాకీకి సంబంధించిన 20 రౌండ్ల బుల్లెట్లు, లష్కరే తోయిబాకు చెందిన ఐదు పోస్టర్లు, మూడు మొబైల్ ఫోన్లు, మూడు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నాయి.

స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం అధికారులు పంపించారు. ఈ ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం ఆపరేషన్‌లో కీలక విజయమని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక మరెవరైనా ఉన్నారా? ఉగ్రవాద నెట్‌వర్క్‌లో ఇంకెవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నంబర్ 250/2026 నమోదు చేశారు. భారత ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7, 25తో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని సెక్షన్లు 13, 18, 23, 39 కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లను గుర్తించి, వాటికి ఆయుధాలు, ఇతర సహకారం అందించే మార్గాలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు తనిఖీలు, ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.