Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు

  • మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం
  • ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్
  • షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
Eknath Shinde1

Eknath Shinde1

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు సోమవారం ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

శివసేనలో చేరిన ఎంపీలలో సంజయ్ హరిభావు జాధవ్, భౌసాహెబ్ రాజారామ్ వాఖ్చౌరే, ఓంప్రకాశ్ భూపాల్‌సింగ్ నింబాల్కర్, సంజయ్ దినా పాటిల్, సంజయ్ ఉత్తమ్‌రావు దేశ్‌ముఖ్, నాగేశ్ బాపురావు పాటిల్ అష్టికర్ ఉన్నారు. వీరిలో నింబాల్కర్, అష్టికర్ ఇప్పటికే ఆదివారం షిండే వర్గంలో చేరనున్నట్లు ప్రకటించారు.

×
×
Ad

ఈ సందర్భంగా ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘‘ఈ ఆరుగురు పులులు ఇప్పుడు నిజమైన శివసేన కుటుంబంలో చేరారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. 2022లో మేము శివసేనను, విల్లు-బాణం గుర్తును కాపాడేందుకు తిరుగుబాటు చేశాం. ఇప్పుడు ఆ పోరాటం రెండో దశ ప్రారంభమైంది.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రజలు మాకు స్పష్టమైన జనాదేశం ఇచ్చారు. మేము బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం. వేరే భావజాలాన్ని అనుసరించిన వారిని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకే అందరూ మా శివసేనలో చేరుతున్నారు.’’ అని అన్నారు.

కొత్త మలుపు

2022లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా శివసేన చీలిపోయింది. ఆ పరిణామాలతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి పార్టీపై, ఎన్నికల గుర్తుపై, బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వంపై రెండు వర్గాల మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం షిండే వర్గాన్నే అధికారిక శివసేనగా గుర్తించడంతో ఆయన రాజకీయంగా మరింత బలపడ్డారు. తాజాగా ఆరుగురు ఎంపీలు చేరడంతో పార్లమెంట్‌లో కూడా షిండే శక్తి పెరిగినట్లైంది.

ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.