మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. మూడోసారి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపడుతారని.. డిప్యూటీ సీఎం పదవి ఏక్ నాథ్ షిండేకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు గురించి బీజేపీ పెద్దలు చర్చిస్తున్నారు. సీటీ రవి, పార్టీ నేతలు చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్ వంటి నేతలు సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 144గా ఉంది. అయితే బీజేపీకి సొంతంగా 106 ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో పాటు షిండే వర్గం 39 మంది ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లు 12 మంది, ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరు, బీవీఏ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా మరో 07 మంది స్వతంత్రుల మద్దతు బీజేపీకి ఉంది. దీంతో బీజేపీకి మొత్తం 167 ఎమ్మెల్యేల మద్దతు ఉంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేతో ఫడ్నవీస్ ఫోన్ లో మాట్లాడరు. క్యాబినెట్ కూర్పు గురించి ప్రధానంగా చర్చిస్తున్నారు. రెబెల్ క్యాంపుతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఎవరెవరకి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. షిండే క్యాంపులో ఎమ్మెల్యేల్లో 10-12 మందికి మంత్రి పదవులు వస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎవరికి, ఎన్ని మంత్రి పదవులు వస్తాయనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని.. త్వరలో జరుగుతుందని, అప్పటి వరకు మంత్రుల జాబితాలు, పుకార్లు నమ్మవద్దని శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే అన్నారు.