Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి

  • మహారాష్ట్రలో భారీ వర్షాలు
  • ముంబై, పూణె జలదిగ్బంధం
  • వర్ష బీభత్సానికి 13 మంది మృతి
Mumbai

Mumbai

మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబై జలదిగ్బంధం అయింది. ఇక పుణెలో కొండచరియలు విరిగి ఇల్లు మట్టిలో కలిసిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

రుతుపవనాలు కారణంగా మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై, పుణె, థానే, పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇప్పటివరకు కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ ముంబైకి ఆరెంజ్ అలర్ట్, పుణెకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

పుణె జిల్లాలోని పాటన్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక ఇంటిపై భారీ మట్టిపెళ్లలు పడటంతో ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక ముంబై పరిధిలో భవనం కూలి ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కుర్ల ప్రాంతంలో చెట్టు కూలి ఒక వృద్ధుడు దుర్మరణం చెందాడు. జాతీయ విపత్తు స్పందన దళం, పోలీసులు, ఇతర సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. లోనావాలా డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ తోంపే మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామంలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, వాటిలో ఒకటి ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

ఇక కర్జత్-లోనావాలా భోర్ ఘాట్ సెక్షన్‌లోని ఠాకూర్‌వాడి, మంకీ హిల్ ప్రాంతాల్లో వరుసగా కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పుణె మధ్య రైల్వే మార్గం తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాల కారణంగా అప్, డౌన్, మిడిల్ లైన్లు దెబ్బతినడంతో 16 రైళ్లను రద్దు చేయగా, మరో 9 రైళ్లను దారి మళ్లించారు. రద్దైన రైళ్లలో సీఎస్‌ఎంటీ-పుణె ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ క్వీన్, ప్రగతి ఎక్స్‌ప్రెస్, ధూలే ఎక్స్‌ప్రెస్, పుణె-సీఎస్‌ఎంటీ సింహగఢ్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు ఉన్నాయి. మరికొన్ని దూర ప్రయాణ రైళ్లను కుదించిన మార్గాల్లో నడుపుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, అలాగే పాత ముంబై-పుణె జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. టన్నెల్-2 సమీపంలో కొండచరియలు విరిగిపడటం, కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల రవాణా పూర్తిగా స్తంభించింది. కనెక్టింగ్ లింక్ సమీపంలో కాంక్రీట్ స్తంభం రోడ్డుపై కూలిపోవడంతో ఎక్స్‌ప్రెస్‌వేను మూసివేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ముంబై-పుణె మధ్య ప్రయాణాలు చేయవద్దని పోలీసులు సూచించారు. పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రభుత్వ ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యాసంస్థలకు సెలవు

మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, పుణె, థానే, పాల్ఘర్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇక పుణె జిల్లాలోని ఘోరవాడి రైల్వే స్టేషన్ సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న ఓ ప్రైవేట్ బస్సులోని 37 మంది ప్రయాణికులను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండగా, ప్రజలు అవసరం లేని ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.