Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ముంబయి ఆర్థిక స్థితి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి.. ముఖ్యంగా ముంబై, థానేల నుంచి పంపించేస్తే మహారాష్ట్రలో డబ్బే ఉండదన్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై తన పేరును కోల్పోతుందన్నారు. వారి వల్లే ముంబైకి ఆర్థిక రాజధానిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఆయన్ను ఇంటికి పంపాలా లేక జైలుకు పంపాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందంటూ మండిపడ్డారు. ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న క్రమంలో గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మరాఠీలను, వారి గర్వాన్ని అవమానించారని, సమాజాన్ని ప్రాతిపదికగా విభజించడానికి ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. గవర్నర్ పదవిలో కూర్చున్న వ్యక్తిని కించపరచడం తనకు ఇష్టం లేదన్నారు. కుర్చీని గౌరవిస్తాను కానీ భగత్ సింగ్ కోశ్యారీ మరాఠీలను అవమానించారని, ప్రజల్లో కోపం ఉందని ఉద్ధవ్ థాకరే అన్నారు. గవర్నర్ మతం ఆధారంగా సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన పరిమితిని దాటుతున్నారన్నారు. “ఆయన్ను ఇంటికి వెళ్లగొట్టాలా అన్న అంశంపై అని ప్రభుత్వం నిర్ణయించుకునే సమయం వచ్చింది. కోశ్యారీ కూర్చున్న స్థానాన్ని గౌరవించడం కోసం ఇంకెంత కాలం మౌనంగా ఉండాలో తెలియట్లేదు. ఆ పదవిని ఉద్దేశించి నేనేం మాట్లాడటం లేదు. కానీ ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి దానిని గౌరవించాలి. ఆయనకు మరాఠీ ప్రజలపై ఉన్న ద్వేషం అనుకోకుండా బయటపడింది. ఈ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అంటూ ఉద్ధవ్ థాక్రే తీవ్రంగా స్పందించారు.
గవర్నర్ వ్యాఖ్యలను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కోరారు. ‘బీజేపీ ప్రతిపాదిత ముఖ్యమంత్రి అధికారం చేపట్టగానే మరాఠీలకు అవమానం ఎదురైంది. గవర్నర్ వ్యాఖ్యలను కనీసం ముఖ్యమంత్రి షిండే ఖండించాలి. ఇది కష్టపడి పనిచేసే మరాఠీ ప్రజలకు అవమానం. సీఎం షిండే మీరు వింటున్నారా? నీపై నీకు ఆత్మగౌరవం ఉంటే.. గవర్నర్ రాజీనామా చేయాలని కోరాలి.’ అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.
PM Narendra Modi: నీటిలో తేలియాడే సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
శుక్రవారం మహారాష్ట్ర గవర్నర్ ముంబైలోని అంధేరీలో ఓ చౌక్‌కు శాంతిదేవి చంపలాల్జీ కొఠారీ పేరును పెట్టే కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ఆయన మాట్లాడుతూ.. ‘గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెను విడిచివెళ్లిపోతే.. ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదు. ముంబయి దేశ వాణిజ్య రాజధానిగా ఉండే అర్హత కోల్పోతుంది’ అని వ్యాఖ్యానించారు. వీటిని మహారాష్ట్ర నేతలు ఖండించారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో గవర్నర్ వివరణ ఇచ్చారు. మరాఠీ ప్రజల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదన్నారు.