PM Narendra Modi: రామగుండం ఎన్టీపీసీ జలాశయం నీటిపై నిర్మించిన 600 ఎకరాల్లో 423 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్తు ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. దేశంలోనే అతి పెద్దదైన నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను ప్రధాని రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండల కేంద్రంలో వర్చువల్‌గా ప్రారంభించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులను ఉద్దేశించి ఆయన వర్చువల్ వేదికగా ప్రసంగించారు. కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా “ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్య – పవర్ @2047” పేరిట ఈ నెల 25 నుంచి 30 వరకు వారం రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 100 ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు, రాష్ట్రాల డిస్కంల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలలో భాగంగా గత 8 సంవత్సరాల కాలంలో పునరుత్పాదక విద్యుత్‌తో సహా విద్యుత్ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధిని గురించి, 2047 నాటికి ఈ రంగంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యుత్ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు.
అదేవిధంగా “రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్” పథకాన్ని ప్రారంభించారు. “నేషనల్ సోలార్ రూఫ్ టాప్ పోర్టల్” ను కూడా ప్రారంభించారు. ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా నిర్మించనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. ఇప్పటికే నిర్మించిన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా విద్యుదీకరణ అనంతరం దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమచల్ ప్రదేశ్, త్రిపుర, విశాఖపట్నం, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ వాసులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రామగుండం 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు కేరళలోని 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకింతం చేశారు. అదేవిధంగా రాజస్థాన్‌లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గుజరాత్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇవాళ చేసిన కార్యక్రమాలు రాబోయే 25 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేశామని ప్రధాని అన్నారు. దేశంలో విద్యుదీకరణ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చిందన్నారు. సోలార్ విద్యుత్‌తో పాటు హైడ్రోజన్ గ్యాస్ వల్ల కలిగే ప్రయోజనాలు దేశ ప్రజలకు చేరబోతున్నాయన్నారుృ. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో విద్యుత్ పరిస్థితి ఎలా ఉండేదో.. కరెంట్ కోతలు, పంపిణీ ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో మనందరికీ తెలుసన్నారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగ స్థితిని మెరుగుపరచడానికి ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నామన్న ఆయన.. నాణ్యమైన విద్యుత్ ప్రతి ఒక్కరికీ అందించే విధంగా ప్రణాళిక రూపొందించడమే కాకుండా సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెట్టామని తెలిపారు.
Punjab Minister: దూకుడుగా ప్రవర్తించిన మంత్రి.. అవమానంగా భావించి వైస్ ఛాన్సలర్ రాజీనామా
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టులు మనం దేశంలో ఉన్నాయని.. తెలంగాణ, కేరళలో జాతికి అంకితం చేసిన నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్టులు దేశంలోనే పెద్దవని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు సూర్యరశ్మి, విద్యుత్‌తో పాటు నీరు ఆవిరి కాకుండా సంరక్షిస్తాయన్నారు. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా తన ఐదేళ్ల పాలన గడిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. చాలా రాష్ట్రాల్లో పాత విద్యుత్ లైన్ల ద్వారా సరఫరా చేయడం వల్ల నష్టాల బారిన పడుతున్నాయన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకుపోతున్నా.. ఇంకా సబ్సిడీలు కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయన్నారు. విద్యుత్ రంగాన్ని రాజకీయాలతో ముడిపెట్టకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎనిమిదేళ్లలో సంస్కరణలు చేపట్టకపోతే దేశపరిస్థితి మరింత దారుణంగా ఉండేదో ఆలోచించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యుత్ రంగాన్ని బలపరిచేందుకు కలిసి రావాలని అన్ని రాష్ట్రాలను విజ్ఞప్తి చేస్తున్నాని ప్రధాని మోదీ కోరారు. ఈసందర్భంగా విద్యుత్ సంస్థలకు పడిన బకాయిలను చెల్లించాలని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.