Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బారామతి ఎయిర్ పోర్ట్ సమీపంలో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో సహా ఆరుగురు మరణించినట్లు డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది. ఇవాళ ( జనవరి 28న) ఉదయం తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆయన ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లెట్ ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో అజిత్ పవార్ సహా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆరుగురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Ajit Pawar: బారామతిలో కూలిన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం
ఈ ఘటన స్థలం నుంచి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహటిన బారామతి బయల్దేరారు. కాగా, అజిత్ పవార్ సుదీర్ఘ కాలం పాటు డిప్యూటీ సీఎంగా కొనసాగారు. పృథ్వీరాజ్ చవాన్(కాంగ్రెస్-NCP), దేవేంద్ర ఫడ్నవీస్ (NDA-2 సార్లు), ఉద్ధవ్ థాక్రే (MVA), ఏక్నాథ్ షిండే(NDA) ప్రభుత్వాల్లో డిప్యూటీగా కొనసాగారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నియోజకవర్గం నుంచి 1991లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీటు నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి లాంటి శాఖలను అజిత్ పవార్ నిర్వహిస్తున్నారు.