మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం బలపరీక్ష జరగాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన క్షణాల్లోనే తన రాజీనామా ప్రకటించారు ఠాక్రే. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్ధవ్.. తన నిర్ణయాన్ని వెలువరించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షే అవసరం లేకుండా పోయింది.
ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తానన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని తప్పనిసరిగా పాటిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. తమ వాళ్లే.. పరాయి వాళ్లయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహావికాస్ అఘాడీకి ప్రత్యర్థుల దిష్టి తగిలిందన్నారు. తమ ప్రభుత్వానికి అదృష్టం కలిసి రాలేదని ఉద్ధవ్ వెల్లడించారు. బాలా సాహెబ్ ఆశయాలను నెరవేర్చామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన.. సీఎం పదవి కోసం పట్టుబట్టి తెగదెంపులు చేసుకుంది. తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి 2019 నవంబర్ 26న మహావికాస్ అఘాడీ కూటమికి ఉద్ధవ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్ 28న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ కొద్దిరోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిరిగి ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తదనంతరం పరిణామాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సర్ది చెబుతూ వచ్చారు.
అయితే ఇటీవల శివసేనలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఈనెల 20న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 5 సీట్లు గెల్చుకుంది. నాలుగు సీట్లు గెల్చేందుకు మాత్రమే ఆ పార్టీకి బలం ఉండగా ఐదు సీట్లు దక్కించుకోవడంపై శివసేనలో అంతర్మథనం మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీకి ఓటేసినట్లు గుర్తించారు. ఫలితాలు వచ్చిన వెంటనే శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే అదృశ్యమయ్యారు. తర్వాత శివసేన ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు.ఈ క్రమంలో శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సుమారు 40 మంది షిండే వర్గంలో చేరిపోయారు. పలువురు స్వతంత్రులు కూడా ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ప్రకటించారు. వారంతా అస్సాంలోని గౌహతిలో మకాం వేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని సందేహంలో పడేశారు. దీంతో మహావికాస్ అఘాడీ సర్కారు మైనార్టీలో పడిపోయింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగిరావాలని ఉద్ధవ్ ఠాక్రే కోరినా లాభం లేకపోయింది.
మరోవైపు బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఒక్కసారిగా చక్రం తిప్పారు. మొదట దిల్లీలో భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపిన ఆయన.. రాత్రికి ముంబయి చేరుకొని గవర్నర్‌తో సమావేశమయ్యారు. కొద్దిసేపటికే అసెంబ్లీలో గురువారం బలనిరూపణ చేసుకోవాలంటూ ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడం వల్ల… ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఎంవీఏ ప్రభుత్వం దాదాపు 32 నెలలు మాత్రమే అధికారంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భాజపా నాయకులు సంబరాల్లో మునిగారు.