మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ పెట్టినప్పటి నుంచి సినిమాను తలపించే ట్విస్టులతో రాజకీయం రసవత్తంగా సాగింది. ఓ వైపు ఉద్ధవ్ ఠాక్రే, శరత్ పవార్, మరో వైపు ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే ఇలా రెండు వర్గాల మధ్య ఎత్తులు పైఎత్తుల మధ్య అధికారం దోబూచులాడింది. చివరకు రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ మద్దతుతో సీఎం పీఠాన్ని అధిష్టించారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టారు.
అనేక కీలక పరిణామాల మధ్య గురువారం ఏక్ నాథ్ షిండే అధికారం చేపట్టారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ కూటమికి చెందిన 120 ఎమ్మెల్యేలతో పాటు తమకు మరో 50 మంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. బాలాసాహెబ్ ఠాక్రే శివసైనికుడు సీఎం అయ్యాడని షిండే అన్నారు. ముందుగా ప్రభుత్వానికి దూరంగా ఉంటా అని ప్రకటించిన ఫడ్నవీస్, ఢిల్లీ బీజేపీ పెద్దల సూచనలతో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే జూన్ 2, 3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్పీకర్ స్థానానికి ఎన్నికలు జరగడంతో పాటు షిండే, ఫడ్నవీస్ సర్కార్ బల నిరూపణ పరీక్ష జరగనుంది. స్పీకర్ గా నానా పటోలే రాజీనామా చేసిన తర్వాత ఏడాది కాలంగా మహారాష్ట్ర స్పీకర్ పదవి ఖాళీగా ఉంది.