Maharashtra Assembly Elections: దేశం మొత్తం మహారాష్ట్ర్ర అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, జమ్మూ కాశ్మీర్‌లో ఫలితాల తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉండబోతాయా..? అని అంతా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో రెండు కూటములు- బీజేపీ నేతృత్వంని ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(షిండే)ల ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ(శరద్ పవార్), ఉద్ధవ్ ఠాక్రే శివసేనల ‘మహా వికాస్ అఘాడీ’ కూటముల మధ్య పోరు నెలకొంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇరు కూటముల్లో పొత్తులు కొలిక్కి వచ్చాయి.
ఇదిలా ఉంటే.. బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నిర్వహించిన అంతర్గత సర్వేలో బీజేపీ కూటమి మహాయుతి మళ్లీ అధికారం సాధిస్తుందని తేలింది. అక్టోబర్ తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్ ఈ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. 288 సీట్లలో మహాయుతికి 160కి పైగా సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. బీజేపీకి 90 నుంచి 95, శివసేన(షిండే) పార్టీకి 40-50 సీట్లు, ఎన్సీపీ(అజిత్ పవార్)కి 25-30 సీట్లు వస్తాయని చెప్పింది. ఈ అంచనాలు నిజమైతే మళ్లీ బీజేపీ మహారాష్ట్రలో అధికారం చేపట్టనుంది.
మరోవైపు హర్యానా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ గెలుపుకు కీలకంగా వ్యవహరించింది. క్షేత్రస్థాయిలో స్వయంసేవకులు పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా అదే మ్యాజిక్ చేసేలా ఆర్ఎస్ఎస్ వ్యూహాలు రూపొందించింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ లెవల్‌లో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోంది. ఆర్ఎస్ఎస్ గ్రూపులు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్ని నేరుగా కలుస్తున్నాయి. ఒక్కో టీము 5-10 మంది వ్యక్తులతో కూడిన చిన్న సమూహాలతో సమావేశమై, వారి కుటుంబాలతో మాట్లాడుతోంది.