Madhya Pradesh Minister: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఆయన పదవీగండం ఎదుర్కుంటున్నట్లు సమాచారం. విజయ్ షా కామెంట్స్ పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అతడ్ని ఇంకా ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. దీంతో అతడు తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కాగా, ఈ వ్యవహారంపై మే 28వ తేదీన తుది నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై విచారణకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన సిట్ ఆ రోజున తుది నివేదిక సమర్పించనుంది. దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉండొచ్చని భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
Read Also: IPL 2025: నీకు 27 కోట్లు దండగా.. ఏడ్చేసిన లక్నో ఓనర్
అయితే, పాకిస్తాన్‌తో పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారి తీసింది. కల్నల్ సోఫియాను విజయ్ షా ‘ఉగ్రవాదుల సోదరి’గా పేర్కొనడంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు.. అతడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇక, దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.