Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది. ట్రకర్ల నిరసన నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యన్ చేసిన ‘ఔకత్’ (స్థాయి) వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ట్రక్కర్ల ప్రతినిధిని ఉద్దేశిస్తూ ‘నీ స్థాయి ఎంత’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. కలెక్టర్‌ని పదవి నుంచి తొలగించింది బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదని సీఎం మోహన్ యాదవ్ అన్నారు. కన్యల్‌ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ పదవికి మారుస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నార్సింగ్ పూర్ కలెకట్ర్ రిజు బఫ్నాను షాజాపూర్ కొత్త కలెక్టర్‌గా నియమించింది.
Read Also: Qassem Soleimani: ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానిని అమెరికా ఎలా చంపిందో తెలుసా?
మంగళవారం డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులతో చర్చల సందర్భంగా.. డ్రైవర్ల ప్రతినిధి కలెక్టర్‌ని మంచిగా మాట్లాడాలని కోరినప్పుడు.. కోపంతో ఉన్న కలెక్టర్ కన్యల్ ‘‘క్యా కరోగే తుమ్, క్యా ఔకత్ హై తుమ్హారీ?’’ (ఏం చేస్తావు.. నీస్థాయి ఏంత.?) అని వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కలెక్టర్ డ్రైవర్లను కోరినట్లు వీడియో చూపిస్తోంది. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు.
ఈ ఉదంతంపై స్పందించిన సీఎం మోహన్ సింగ్.. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని, ఎంత పెద్ద అధికారి అయినా, తను పేదల మనోభావాలను గౌరవించాలని, మా ప్రభుత్వంలో ఇలాంటి వాటికి చోటు లేదని అన్నారు. తాను ఓ కూలి కొడుకునని సీఎం చెప్పారు. ఇటువంటి భాష మాట్లాడే అధికారులకు ఫీల్డ్ పోస్టింగ్‌లో ఉండే అర్హత లేదని, ఇలాంటి వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు.