మరో హృదయవిదారక ఘటన. దేశంలో ప్రభుత్వం ఆస్పత్రులు, సదుపాయాలను ప్రశ్నించే ఘటన. పేదోళ్లకు కనీస వైద్యం, సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలిపే ఓ సన్నివేశం. ప్రస్తుతం దేశంలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని ప్రశ్నిస్తోంది. రెండేళ్ల తన సోదరుడి శవాన్ని ఒడిలో పెట్టుకుని రోడ్డు పక్కన, మురికి పరిసరాల్లో కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడి ఘటన దేశ వ్యాప్తంగా అందరి మనుసుల్ని కదిలిస్తోంది. తన ఒళ్లో తమ్ముడి శవాన్ని పెట్టుకుని, ఈగలు వాలకుండా చూసుకుంటున్న ఆ పిల్లాడి నిస్సహాయత అందర్ని కంటతడి పెట్టిస్తోంది. కుమారుడి శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి స్తోమత లేని ఓ తండ్రి కన్నీటి గాథ ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది.
ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం మోరెనా పట్టణంలో జరిగింది. అంబాహ్ లోని బద్ ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ తన కొడుకు వైద్యం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. రెండేళ్ల పిల్లవాడు తీవ్రమైన రక్తహీనత, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న సమయంలో మరణించాడు. కుమారుడు మరణించడంతో సొంత గ్రామానికి తీసుకెళ్లే స్తోమత లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బందిని అంబులెన్స్ సమకూర్చాలని అడిగినా.. ఆ నిరుపేద తండ్రి మాటలు పట్టించుకునే వారు కురువయ్యారు. 30 కిలోమీటర్లు ఉన్న సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనం కోసం వెతికేందుకు తండ్రి వెళ్లాడు. తన 8 ఏళ్ల కుమారుడు గుల్షాన్ ను మరణించిన తన కొడుకు రెండేళ్ల రాజాను స్థానికంగా ఉన్న నెహ్రూ పార్క్ ముందు వదిలిపెట్టాడు.
Read Also: Bandi Sanjay: దమ్ముంటే ద్రౌపది ముర్ముని ఓడించాలి.. కేసీఆర్ కు సవాల్
ప్రభుత్వం ఆస్పత్రి సిబ్బంది వాహనాన్ని సమకూర్చకపోగా.. బయటకు వెళ్లి డబ్బు చెల్లించి వాహనాన్ని మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న అంబులెన్స్ రూ.1500 చెల్లించితే సొంతూరుకు తీసుకెళ్తా అని చెప్పాడు. అయితే అది కూడా చెల్లించే స్తోమత పూజారామ్ జాతవ్ దగ్గర లేదు. అరగంట పాటు అక్కడే తన తండ్రి కోసం ఒడిలో తమ్ముడి శవాన్ని పెట్టుకుని గోడ పక్కన కూర్చుండి పోయాడు గుల్షాన్. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి అంబులెన్స్ ఇచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.