UP Crime: పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో బేకరీ యజమాని అయిన వీరేంద్ర యాదవ్ 6 పేజీల సూసైడ్ నోట్ రాసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలతో సమాజంలో పరువు పోవడం, తన కుమార్తె వివాహంపై ఆందోళనతో ఆయన ఈ తీవ్ర చర్య తీసుకున్నాడు. పొరుగింటి వారితో ర్యాంప్ నిర్మాణం గొడవతో ఈ వివాదం మొదలైంది.
లక్నోలోని మనక్ నగర్ ప్రాంతంలో బేకరీ నడుపుతున్న వీరేంద్ర యాదవ్, తన ఇంటి బయట ర్యాంప్ నిర్మించడంపై పొరుగువారైన సుర్జీత్ యాదవ్, అతడి భార్య అనితతో వివాదం ఏర్పడింది. వివాదం తీవ్రం కావడంతో ఈ కేసు కోర్టుకు చేరింది. అయితే, దానిని ఆపాలని కోర్టు ఆదేశించినప్పటికీ, వీరేంద్ర యాదవ్ ఇంటి ముందు సుర్జీత్ యాదవ్ నిర్మాణాన్ని కొనసాగించారు. వీరేంద్ర పలుమార్లు నిరసన తెలియజేసినప్పటికీ, ఆ కుటుంబం వినిపించుకోలేదు. దీంతో పాటు వారు వీరేంద్ర, అతడి కుటుంబంపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
Read Also: Illegal Sand Transportation: ఆంధ్రా నుంచి సత్తుపల్లి వరకూ జోరుగా అక్రమంగా ఇసుక రవాణా
మృతుడు వీరేంద్ర భార్య నీలం చెబుతున్న దాని ప్రకారం, తప్పుడు కేసులో సమన్లు అందుకున్న తర్వాత తన భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, తన కుటుంబం సమాజంలో గౌరవాన్ని కోల్పోతుందని భయపడ్డాడని, తన కుమార్తె వివాహం కాదేమో అని ఆందోళన చెందినట్లు చెప్పింది. తాను జైలుకు వెళ్తే తన కుమార్తెను ఎవరూ పెళ్లి చేసుకోరేమో అని, విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆధారాలు లేకుండా వీరేంద్రపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసినట్లు అతడి కుమారుడు అభయ్ ఆరోపించారు. సుర్జీత్, అనితా యాదవ్ ఇద్దరూ కూడా వీరేంద్ర కుటుంబాన్నే కాకుండా, పొరుగున ఉన్న మరో కుటుంబాన్ని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.