Operation Sindoor 2.0: పాకిస్తాన్, భారత్‌పై మరోసారి పహల్గామ్ తరహా దాడికి పాల్పడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని భారత్ సైన్యం వార్నింగ్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత ప్రమాదకరంగా మారుతుందని పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ భారత్ వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C), లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మంగళవారం అన్నారు. జమ్మూ లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక పోస్టుల్ని చాలా తక్కువ సంఖ్యలో ధ్వంసం చేశామని, మరోసారి పాక్ దుస్సాహసానికి పాల్పడితే భారత ప్రతిస్పందన చాలా ఎక్కువగా ఉంటుందని కటియార్ అన్నారు. పాకిస్తాన్ ఆలోచనా విధానం మారకపోతే విధ్వంసం తప్పదని హెచ్చరించారు.
లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రశంసించారు. పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం, పాకిస్తాన్‌కు తగిన జవాబు ఇచ్చిందని అన్నారు. 1965 భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన మాజీ సైనికుల ర్యాలీలో కటియార్ ప్రసంగించారు. పాక్ భవిష్యత్తులో చేసే దాడుల్ని తిప్పికొట్టేందుకు భారత్ సైన్యం సంసిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 1965 యుద్ధాన్ని గుర్తు చేస్తూ.. జమ్మూ కాశ్మీర్ ప్రజల దేశభక్తిని తక్కువ అంచనా వేయడమే పాకిస్తాన్ ఓటమికి కారణమని ఆయన అన్నారు.