జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రతిపాదనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్య సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ తమ నివేదికను సమర్పించే వరకు తదుపరి చర్యలను వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Abhishek Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది.. మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న అభిషేక్ బెనర్జీ
జస్టిస్ వర్మపై అభిశంసనకు 146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అయితే దీనిపై తొందరపడి నిర్ణయం తీసుకోకుండా.. కమిటీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. ఇక కమిటీ నివేదిక స్పీకర్‌కు ఇవ్వనున్నారు. అనంతరం దాన్ని సభలో ప్రవేశపెట్టాక.. ఓటింగ్ నిర్వహించనున్నారు. అభిశంసనకు ఓటు వేస్తే జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించనున్నారు. అవినీతిని పార్లమెంట్ ఏ మాత్రం సహించబోదని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.
ఇది కూడా చదవండి: Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు
మార్చి 14న జస్టిస్ యశ్వంత వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి 11:43 గంటలకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెల్లాచెదురుగా పడి ఉన్న నగదును గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగదు వీడియోలను రికార్డ్ చేసి ఢిల్లీ పోలీసులు.. సీనియర్ అధికారులకు పంచారు. అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందించారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖన్నా విచారణకు ఆదేశించారు. దాదాపు రూ.15 కోట్ల వరకు నగదు ఉంటుందని సమాచారం.
భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. కానీ ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఇంట్లో దొరికిన నగదు వర్మదిగా తేల్చింది.
ఈ కేసులో న్యాయ సూత్రాలను పాటించలేదని.. తనను పూర్తిస్థాయిలో విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్‌ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారని యశ్వంత్ వర్మ ఆరోపించారు. ఇక విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనదిగా పరిగణించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ చివరికి సుప్రీం ధర్మాసనం.. వర్మ వాదనలను తోసిపుచ్చి కొట్టేసింది.